రివ్యూ: ఓం నమో వేంకటేశాయ

100217cininamoa

చిత్రం పేరు: ఓం నమో వేంకటేశాయ
తారాగణం: నాగార్జున.. సౌరభ్‌జైన్‌.. అనుష్క.. ప్రగ్యాజైస్వాల్‌.. జగపతిబాబు.. విమలారామన్‌.. అస్మిత.. రావు రమేష్‌.. వెన్నెల కిషోర్‌.. ప్రభాకర్‌.. రఘుబాబు తదితరులు
సంగీతం: ఎం.ఎం. కీరవాణి
ఛాయాగ్రహణం: ఎస్‌.గోపాల్‌రెడ్డి
కథ, మాటలు: జె.కె.భారవి
నిర్మాత: మహేశ్‌రెడ్డి
దర్శకత్వం: రాఘవేంద్రరావు
పతాకం: ఎ.ఎం.ఆర్‌. సాయికృపా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై.లి.

 

 

మర్షియల్‌ చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలుస్తూ వచ్చిన కె.రాఘవేంద్రరావు తనలోని మరో కోణాన్ని చూపిస్తూ భక్తి ప్రధానమైన చిత్రాల్ని తెరకెక్కిస్తున్నారు. వాటిలోనూ తనదైన మార్క్‌ని చూపిస్తూ ఆబాల గోపాలాన్ని అలరిస్తున్నారు. అందులో భాగంగా రూపుదిద్దుకొన్న చిత్రమే ‘ఓం నమో వేంకటేశాయ’. ‘అన్నమయ్య’, ‘శ్రీరామదాసు’, ‘శిరిడిసాయి’ చిత్రాల తర్వాత రాఘవేంద్రరావు-నాగార్జున కలయికలో వస్తున్న చిత్రమిది. వేంకటేశ్వరస్వామికి పరమ భక్తుడైన హథీరాం బాబాజీ జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. ఈ సినిమాను తీస్తే రాఘవేంద్రరావే తీయాలి.. చేస్తే నాగార్జునే చేయాలి అన్నట్టుగా ఆ ఇద్దరూ భక్తి ప్రధానమైన చిత్రాలపై ఓ ప్రత్యేకమైన ముద్రవేశారు. అందుకే ‘ఓం నమో వేంకటేశాయ’కి కొబ్బరికాయ కొట్టినప్పటి నుంచే అంచనాలు షురూ అయ్యాయి. మరి ఆ మేజిక్‌ మరోసారి తెరపై కనిపించిందా? శ్రీవారి భక్తుడు ‘అన్నమయ్య’గా ఒదిగిపోయిన నాగార్జున, హథీరాం బాబాగా ఎలా నటించాడు.. లాంటి ప్రశ్నలకు సమాధానాలు..

 

కథేంటంటే?: దేవుడిని చూసే విద్య నేర్చుకోవాలంటూ బాల్యంలోనే ఇంటి నుంచి బయటకొస్తాడు రామ(నాగార్జున). వేద పాఠశాలలో విద్యనభ్యసిస్తూ గురువు(సాయికుమార్‌) చెప్పిన మాటతో తపస్సుకు పూనుకుంటాడు. ఆ తర్వాత తిరుమల చేరతాడు. కానీ స్వామి దర్శనం మాత్రం కాదు. దేవుడ్నే చూడాలంటూ అన్న, పానీయాలు లేకుండా అయిదురోజుల పాటు గుడిముందే కూర్చుంటాడు. స్వామికోసమే ఈ జీవితం అంటూ సదా ఆయన ఆరాధనలో మునిగి తేలుతుంటాడు. అలాంటి పరమ భక్తుడికి స్వామి దర్శన భాగ్యం కలిగిందా? లేదా? తిరుమలలో ఆలయ అధికారి గోవిందరాజులు(రావు రమేష్‌) రామపై ఎందుకు కక్ష కట్టాడు? రామను పరీక్షించేందుకు స్వామి ఏం చేశాడు? ఆ ప్రయత్నంలో రామ జీవితంలో ఎదురైన అనుభవాలు ఎలాంటివి? ఆయన్ని మనువాడాలనుకొన్న భవానీ (ప్రగ్యాజైస్వాల్‌) కథేంటి? రామ కోసం ఆమె చేసిన త్యాగం ఎలాంటిది? శ్రీవారికి మరో భక్తురాలైన కృష్ణమ్మ(అనుష్క)కి రామకి మధ్య సంబంధం ఏమిటి? రామ.. హథీరాం బాబాగా ఎలా మారాడు? తదితర విషయాల్ని తెలుసుకోవాలంటే వెండితెరపై సినిమా చూడాల్సిందే.

ఎలా ఉందంటే: భక్తికున్న శక్తితో వేంకటేశ్వరస్వామిని మురిపించిన మరో పరమ భక్తుడు హథీరాం బాబా కథ ఇది. బాల్యంలోనే స్వామిని ప్రత్యక్షంగా చూడాలంటూ బయటకొచ్చిన హథీరాం తిరుమలను కలియుగ వైకుంఠంగా మార్చడంలో కృషి ఎలాంటిది? స్వామి వారి చేతుల మీదుగానే సజీవ సమాధి ఎలా అయ్యాడు? తదితర విషయాలతో ఈ చిత్రం సాగుతుంది. వేంకటాచల స్థలపురాణం, హథీరాంబాబా, కృష్ణమ్మల భక్తి నేపథ్యంలో తొలిసగ భాగం సాగుతుంది. భక్తులపై జరుగుతున్న దోపిడీని అడ్డుకుంటూ తిరుమలను పరమ పవిత్రంగా ఉంచేందుకు హథీరాం బాబా ప్రయత్నించడం, స్వామి భక్తులకు పుణ్య క్షేత్రం విశిష్టతను చాటిచెప్పడం తదితర సన్నివేశాలతో చిత్రం సాగుతుంది. అధికారి గోవిందరాజులు, ఆయన బృందం చేసే అరాచకాలను అడ్డుకుంటూ హథీరాం బాబా స్వామి సేవలో పునీతమయ్యే తీరును తెరపై కళ్లకు కట్టారు.

స్వామినే ప్రత్యక్షంగా చూడాలని కలలు కన్న హథీరాం బాబాకు ఆ దేవుడే దిగివచ్చి పాచికలాడే ఘట్టంతో తొలిసగ భాగం పూర్తవుతుంది. మలి సగభాగంలో నిత్య కల్యాణం, నవనీత సేవ, శేషవస్త్రం విశిష్టత తదితర విషయాలన్నింటినీ కథతో ముడిపెడుతూ చెప్పిన తీరు ఆకట్టుకుంటుంది. పతాక సన్నివేశాలు మరింత రక్తి కట్టిస్తాయి. స్వామివారి ఆభరణాలను దోచాడనే నింద హథీరాం బాబాపై పడుతుంది. ఆ నిందను తొలగించుకునేందుకు హథీరాం బాబా ఏం చేశాడు? రాజు హథీరాంబాబాకి పెట్టిన పరీక్ష నుంచి గట్టెక్కించేందుకు సాక్షాత్తూ దిగి వచ్చిన ఆ స్వామివారు ఏం చేశారు… అనే విషయాలు అలరిస్తాయి. ఇదొక ఆధ్యాత్మిక చిత్రమే అయినా భక్తులకు తెలియని ఎన్నో విషయాలను తెరపై చూపించారు. హథీరాంబాబా కథను ఒక డాక్యుమెంటరీలా కాకుండా ఆద్యంతం అలరించేలా చెప్పిన విధానం ఆకట్టుకుంటుంది.

 

బలాలు
+ కథ, కథనం
+ నటీనటులు
+ సంగీతం
+ ఛాయాగ్రహణం
+ పతాక సన్నివేశాలు

బలహీనతలు
- తొలి సగభాగంలో డ్రామా లేకపోవడం

చివరిగా: ‘ఓం నమో వేంకటేశాయ’.. కొలిచే వారికే కాదు.. చూసేవారికీ కొంగు బంగారమే.

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టికోణానికి సంబంధించింది. ఇది అతని వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.