ఇది శ్రమకు తగ్గ ఫలితం: సెహ్వాగ్

మొహాలి:ఇంగ్లండ్తో ఇక్కడ శనివారం నుంచి ఆరంభం కానున్న మూడో టెస్టుకు భారత జట్టులో తిరిగి వికెట్ కీపర్ పార్థీవ్ పటేల్ను ఎంపిక చేయడాన్ని మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ స్వాగతించాడు. ఇటీవల కాలంలో దేశవాళీ టోర్నీల్లో రాణిస్తున్న పార్థీవ్ ఎంపిక సరైనదిగా సెహ్వాగ్ పేర్కొన్నాడు. పార్థీవ్ భారత జట్టులో పునరాగమనం చేయడానికి ఆటపై అతనికి ఉన్న అంకితభావమే కారణమన్నాడు. అయితే మూడో టెస్టు ఎంపిక విషయంలో చాలా మంది ఢిల్లీ వికెట్ కీపర్ రిషబ్ పంత్పై మొగ్గు చూపడాన్ని మాత్రం సెహ్వాగ్ తప్పుబట్టాడు. ప్రస్తుతం రిషబ్ పంత్ ఎంపిక అనేది సరైన చర్యకాదనే అభిప్రాయం సెహ్వాగ్ వ్యక్తం చేశాడు.

‘పార్థీవ్కు స్థానం దక్కుతుందని నేను అస్సలు అనుకోలేదు. సాహా గాయపడటంతో పార్థీవ్ కు అనూహ్యంగా చోటు దక్కింది. ఇది అతను గతకొంతకాలంగా పడుతున్న శ్రమకు ప్రతిఫలం. కష్టిస్తే ఫలితం దక్కుతుందనే దానికి పార్థీవే ఉదాహరణ. ఏ ఒక్కరూ ఆశను వదులుకోకండి. దానికోసం శ్రమించండి’అని సెహ్వాగ్ పేర్కొన్నాడు. పార్థీవ్ కు చోటు దక్కడానికి టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి, ప్రధాన కోచ్ అనిల్ కుంబ్లేల కారణం కావచ్చని సెహ్వాగ్ తెలిపాడు. అనుభవానికి వారు పెద్ద పీట వేయడంతో పార్థీవ్కు చోటు దక్కిందని తాను అనుకుంటున్నట్లు సెహ్వాగ్ పేర్కొన్నాడు.

 

17 ఏళ్ల వయసులో 2002లో తన తొలి టెస్టు ఆడిన పార్థివ్, భారత్ తరఫున ఎనిమిదేళ్ల క్రితం చివరి సారి టెస్టు ఆడాడు. మొత్తం 20 టెస్టుల్లో కలిపి అతను 683 పరుగులు చేశాడు. రంజీ ట్రోఫీలో బ్యాటింగ్‌లో నిలకడగా రాణిస్తూ ఫామ్‌లో ఉన్న కారణంగానే నమన్ ఓజా, దినేశ్ కార్తీక్‌లను వెనక్కి తోసి పార్థివ్ అవకాశం దక్కించుకున్నాడు.