నా లెక్క వేరు ఉంది : నాగార్జున

81475220720_625x300

సీనియర్ స్టార్లలో ఫుల్ ఫాంలో ఉన్న హీరో కింగ్ నాగార్జున. ఇప్పటికీ రొమాంటిక్ హీరో పాత్రలతో పాటు ప్రయోగాత్మక చిత్రాలకు కూడా సై అంటూ అందరికీ షాక్ ఇస్తున్నాడు. త్వరలో మరోసారి భక్తుడిగా నటించిన ఓం నమో వేంకటేశాయ  సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు నాగ్. ఇది నాగ్ తెర మీద కనిపిస్తున్న 98వ సినిమా. ఈ 98 చిత్రాల్లో కొన్ని నాగ్ అతిథి పాత్రల్లో కనిపించిన చిత్రాలు కూడా ఉన్నాయి.

ఈ సినిమా తరువాత నాగ్ చేయబోయే రెండు సినిమాలు కూడా ఇప్పటికే ప్రకటించేశారు. ఓంకార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రాజుగారి గది 2′ సినిమా ఇప్పటికే ప్రారంభం కాగా.. సోగ్గాడే చిన్ని నాయనా ఫేం కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో బంగార్రాజు సినిమాకు ఓకె చెప్పాడు. ఇదే నాగ్ నటించే వందో సినిమా. దీంతో అభిమానులు బంగార్రాజు సినిమా మీద భారీ అంచనాలు పెట్టుకున్నారు.

కానీ నాగ్ మాత్రం బంగార్రాజు తన వందో సినిమా కాదని చెపుతున్నాడు. తాను అతిథి పాత్రల్లో నటించిన సినిమాలు తన లెక్కలోకి రావని.. అందుకే తన వందో సినిమా విషయంలో తన లెక్కవేరని చెపుతున్నాడు. త్వరలోనే ఆ లెక్క అభిమానులకు చెప్తానంటున్న కింగ్.. వందో సినిమా కోసం గ్రాండ్గా ప్లాన్ చేస్తున్నాడట. ఇప్పటికే చిరంజీవి, బాలకృష్ణలు తమ మైల్ స్టోన్ చిత్రాలను భారీగా అభిమానుల ముందుకు తీసుకురాగా.. నాగ్ మూవీ ఎలా ఉండబోతోందో అని ఫ్యాన్స్ తో పాటు ఇండస్ట్రీ జనాలు ఎదురుచూస్తున్నారు.