నాకు నేనే పోటీ

71485892060_625x300

ప్రముఖ నృత్యదర్శకుడు, నటుడు రాఘవ లారెన్స్ తనకు తానే పోటీ కానున్నారు. నిజమే లారెన్స్  హీరోగా నటించిన రెండు చిత్రాలు ఒకే రోజు విడుదలకు సిద్ధం అవుతున్నాయి. ఈ రెండూ బయటి నిర్మాతలకు ఇతర దర్శకులతో చేసిన చిత్రాలు. అందులో ఒకటి మొట్టశివ కెట్టశివ. ఇది తెలుగులో మంచి విజయాన్ని సాధించిన పటాస్‌ చిత్రానికి రీమేక్‌. నటి నిక్కీగల్రాణి నాయకిగా నటించారు. ఇతర ముఖ్య పాత్రల్లో సత్యరాజ్, రానా, వంశీకృష్ట, కోవైసరళ, సీమాన్ నటించిన ఈ చిత్రానికి సీనియర్‌ నటి జయచిత్ర వారసుడు అమ్రేష్‌ గణేశ్‌ సంగీతాన్ని అందించారు. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ సూపర్‌గుడ్‌ ఫిలింస్‌ పతాకంపై ఆర్‌బీ.చౌదరి నిర్మించిన పటాస్‌ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఈ నెల ఐదవ తేదీన నిర్వహించనున్నట్లు చిత్రా వర్గాలు వెల్లడించారు.

అదే విధంగా చిత్రాన్ని ఈ నెల17న విడుదల చేయనున్నట్లు ప్రకటనను విడుదల చేశారు. ఇక లారెన్స్  నటించిన మరో చిత్రం శివగంగ. ఇది కన్నడంలో హిట్‌ అయిన చిత్రానికి రీమేక్‌. ప్రముఖ దర్శకుడు పి.వాసు దర్శకత్వం వహించిన ఇందులో లారెన్స్ కు జంటగా నటి రితికాసింగ్‌ నటించారు.శక్తివాసు, వడివేలు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని ట్రైడెంట్‌ ఆర్ట్స్‌ పతాకంపై ఆర్‌.రవీంద్రన్  నిర్మించారు. ఎస్‌.తమన్  సంగీతాన్ని అందించిన శివగంగ చిత్రాన్ని ఈ నెల 17వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర వర్గాలు ప్రకటనల ద్వారా ప్రచారాన్ని మొదలెట్టారు.దీంతో లారెన్స్  చిత్రానికి ఆయన మరో చిత్రమే పోటీ కానుంది.అయితే ప్రకటించినట్లుగా ఈ రెండు చిత్రాలు ఒకే రోజు విడుదలవుతాయా? లేక ఏదో ఒకటి పోటీ నుంచి విరమించుకుంటుందా? అన్నది వేచి చూడాలి.