విరాట్ కొత్త చరిత్ర

61486710531_625x300

బంగ్లాదేశ్ తో ఇక్కడ జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి విశ్వరూపం ప్రదర్శించాడు. గురువారం తొలి రోజు ఆటలో సెంచరీ బాదిన కోహ్లి.. శుక్రవారం రెండో రోజు ఆటలో కూడా దూకుడుగా ఆడి మరో శతకం నమోదు చేశాడు. ఓవరాల్ గా 239 బంతుల్లో 24 ఫోర్లతో డబుల్ సెంచరీతో కోహ్లి అదరగొట్టాడు. ఇది కోహ్లి టెస్టు కెరీర్లో నాల్గో డబుల్ సెంచరీ కావడం విశేషం. మరొకవైపు ఈ నాలుగు డబుల్ సెంచరీల్ని వరుస టెస్టు సిరీస్ల్లో సాధించడం మరొక విశేషం. తొలుత వెస్టిండీస్ పై ద్విశతకం కొట్టిన కోహ్లి.. ఆపై న్యూజిలాండ్, ఇంగ్లండ్లతో జరిగిన వరుస టెస్టుల్లో కూడా డబుల్ సెంచరీలు సాధించాడు. ప్రస్తుతం బంగ్లాదేశ్ తో టెస్టుల్లో డబుల్ సెంచరీ సాధించి కొత్త చరిత్ర సృష్టించాడు. ఇలా వరుస సిరీస్ ల్లో డబుల్ సెంచరీలు సాధించిన ఏకైక ఆటగాడిగా కోహ్లి కొత్త రికార్డు నెలకొల్పాడు. గత ఏడు నెలల కాలంలో కోహ్లి వరుసగా నాలుగు డబుల్ సెంచరీల్ని సాధించడం అతనిలోని అసాధారణ ఆటకు అద్దం పడుతోంది. గతేడాది జూన్ లో విండీస్ పై డబుల్ సెంచరీ వేటను ఆరంభించిన కోహ్లి.. వరుస సిరీస్ ల్లో ద్విశతకాలను సాధిస్తూ దుమ్మురేపుతున్నాడు.

ఈ రోజు ఆటలో భాగంగా తొలుత ఓవర్ నైట్ ఆటగాడు అజింక్యా రహానే తో కలిసి కోహ్లి ఇన్నింగ్స్ ను పరుగులు పెట్టించాడు. ఈ జోడి 222 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించి భారత్ ను పటిష్ట స్థితికి చేర్చింది. అయితే రహానే(82) నాల్గో వికెట్ గా అవుట్ కావడంతో వీరి భారీ భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తరువాత వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహాతో కలిసి కోహ్లి ఇన్నింగ్స్ ను నడిపించాడు. ఈ క్రమంలోనే కోహ్లి డబుల్ సెంచరీని సాధించాడు. కాగా, కోహ్లి(204) డబుల్ సెంచరీ సాధించిన కొద్ది సేపటికే పెవిలియన్ చేరాడు.