చిక్కినట్లే చిక్కి.. త్రుటిలో చేజారిన విజయం

22news-sports1a

6 బంతుల్లో 16గా ఉన్న సమీకరణం కాస్తా.. 4 బంతుల్లో 6గా మారిన వేళ.. మరో అద్భుత విజయం భారత్‌ ఖాతాలో చేరిపోయినట్లే అని ఎంత ధీమానో! కానీ ఆ ధీమా ఎంతోసేపు నిలబడలేదు. నాలుగు బంతుల్లో కథ మారిపోయింది. చేతిలో ఉన్న మ్యాచ్‌ జారిపోయింది. అద్భుత పోరాటంతో అసాధ్యాన్ని సుసాధ్యం చేసేలా కనిపించిన నయా సంచలనం కేదార్‌ జాదవ్‌ (90; 75 బంతుల్లో 12×4, 1×6).. టీమ్‌ఇండియాను గెలుపు తీరాల దాకా తీసుకెళ్లాడు కానీ విజయాన్నందించలేకపోయాడు. 322 పరుగుల భారీ లక్ష్యానికి అతి చేరువగా వెళ్లిన భారత్‌.. కేవలం 5 పరుగుల తేడాతో ఓడిపోయింది. రెండు నెలల నుంచి భారత గడ్డపై విజయం కోసం నిరీక్షిస్తున్న ఇంగ్లాండ్‌.. ఎట్టకేలకు బోణీ కొట్టి కాస్త వూపిరి పీల్చుకుంది.

భారత్‌-ఇంగ్లాండ్‌ వన్డే సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల తరహాలోనే చివరి పోరూ హోరాహోరీనే. ఐతే ఈసారి ఫలితం మాత్రం మారింది. విజయం ఆతిథ్య జట్టును వరించలేదు. తొలి వన్డేలో అసాధారణంగా చెలరేగిపోయి భారత్‌ను గెలిపించిన కేదార్‌ జాదవ్‌ (90) మరోమారు గొప్ప ఇన్నింగ్స్‌ ఆడాడు కానీ.. ఈసారి తన జట్టుకు విజయాన్నివ్వలేకపోయాడు. ఆదివారం 322 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 316 పరుగులే చేసింది. కేదార్‌తో పాటు పాండ్య (56; 43 బంతుల్లో 4×4, 2×6) కూడా బాగానే పోరాడాడు. కోహ్లి (55; 63 బంతుల్లో 8×4), యువరాజ్‌ (45; 57 బంతుల్లో 5×4, 1×6) కూడా తమ వంతు ప్రయత్నం చేశారు. ఐతే స్టోక్స్‌ (3/63), బాల్‌ (2/56) భారత్‌ను కట్టడి చేసి ఇంగ్లాండ్‌ విజయంలో కీలక పాత్ర పోషించారు. అంతకుముందు జేసన్‌ రాయ్‌ (65; 56 బంతుల్లో 10×4, 1×6), స్టోక్స్‌ (57 నాటౌట్‌; 39 బంతుల్లో 4×4, 2×6), బెయిర్‌స్టో (56; 64 బంతుల్లో 5×4, 1×6), వోక్స్‌ (34; 19 బంతుల్లో 4×4, 1×6) రాణించడంతో ఇంగ్లాండ్‌ 8 వికెట్ల నష్టానికి 321 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌ ఓడినా సిరీస్‌ 2-1తో భారత్‌ సొంతమైంది. ఆల్‌రౌండ్‌ ప్రదర్శన చేసిన స్టోక్స్‌ ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా ఎంపికవగా.. సిరీస్‌లో అనూహ్య ప్రదర్శన చేసిన కేదార్‌ జాదవ్‌ ‘మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌’గా నిలిచాడు. మూడు టీ20ల సిరీస్‌ గురువారం ఆరంభమవతుంది.

అప్పటికి ఆశల్లేవు..:
ధావన్‌ స్థానంలో వచ్చిన రహానె (1) కూడా విఫలమయ్యాడు. తొలి ఓవర్లోనే సిక్సర్‌, ఫోర్‌ బాది వూపుమీద కనిపించిన రాహుల్‌ (11) కూడా వైఫల్యాన్ని కొనసాగించాడు. దీంతో భారత్‌కు మరోసారి పేలవ ఆరంభమే. ఐతే కోహ్లి, యువరాజ్‌ జోడీ భారత్‌ స్కోరును 100 దాటించడంతో భారత అభిమానుల్లో పెద్దగా కంగారేమీ కనిపించలేదు. ఇక్కడి నుంచి మ్యాచ్‌పై భారత్‌ నెమ్మదిగా పట్టు కోల్పోతూ వచ్చింది. ఒకసారి జీవనదానం పొందిన కోహ్లి.. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. జట్టు స్కోరు 102 వద్ద స్టోక్స్‌ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. గత మ్యాచ్‌ హీరోలు యువరాజ్‌, ధోని (25) క్రీజులో బాగానే కుదురుకున్నా.. కీలక సమయంలో వికెట్లిచ్చేశారు. దీంతో 32 ఓవర్లో భారత్‌ 173/5కు చేరుకుంది. మ్యాచ్‌పై దాదాపుగా ఆశలు వదిలేసుకునే పరిస్థితి వచ్చింది. కానీ..

అద్భుత పోరాటం..: ధోని ఐదో వికెట్‌ రూపంలో వెనుదిరిగే సమయానికి భారత్‌ 110 బంతుల్లో 148 పరుగులు చేయాలి. తొలి వన్డేలో కేదార్‌ మెరుపు శతకం సాధించినా.. అప్పటితో పోలిస్తే ఈ మ్యాచ్‌ పరిస్థితులు భిన్నం. క్రీజులో అతడికి తోడుగా ఉన్నది కోహ్లి కాదు, పాండ్య. దీంతో భారత్‌ విజయానికి చాలా దూరంలో నిలిచిపోతుందనే అనుకున్నారంతా. ఐతే మొదట ఆచితూచి ఆడిన జాదవ్‌, పాండ్య.. తర్వాత చెలరేగారు. ఇద్దరూ పోటాపోటీగా షాట్లు ఆడటంతో లక్ష్యం కరుగుతూ పోయింది. చివరి 5 ఓవర్లలో 47 పరుగులు అవసరమయ్యాయి. స్టోక్స్‌ 46వ ఓవర్లో పాండ్యను ఔట్‌ చేయడంతో పాటు నాలుగే పరుగులిచ్చి భారత్‌పై ఒత్తిడి పెంచాడు. అయినా జాదవ్‌ తగ్గలేదు. వికెట్లు పడుతున్నా పోరాటం కొనసాగించాడు. కానీ భారత్‌ను గెలిపించలేకపోయాడు.

మధ్యలో పట్టు చిక్కినా..: అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లాండ్‌.. ఆరంభ, ముగింపు మెరుపులతో భారీ స్కోరు సాధించింది. రాయ్‌ ఎప్పట్లాగే ధాటిగా ఆడగా.. గాయపడ్డ హేల్స్‌ స్థానంలో వచ్చిన బిల్లింగ్స్‌ (35; 58 బంతుల్లో 5×4) ఆచితూచి ఆడాడు. ఈ జోడీ 104 బంతుల్లో 98 పరుగులు జోడించింది. జడేజా వీళ్లిద్దరినీ వరుస ఓవర్లలో పెవిలియన్‌ చేరడంతో ఇంగ్లాండ్‌ ఇన్నింగ్స్‌ నెమ్మదించింది. బెయిర్‌ స్టో, మోర్గాన్‌ (43; 44 బంతుల్లో 2×4, 3×6) కుదురున్నాక బ్యాట్‌ ఝులిపించడంతో రన్‌రేట్‌ వూపందుకుంది. 33 ఓవర్లకు ఇంగ్లాండ్‌ 193/2తో పటిష్ట స్థితిలో కనిపించింది. ఐతే ప్రమాదకరంగా మారుతున్న మోర్గాన్‌ను ఔట్‌ చేసిన పాండ్య ఇంగ్లాండ్‌కు కళ్లెం వేశాడు. బట్లర్‌ (11), మొయిన్‌ అలీ (2) విఫలమయ్యారు. బెయిర్‌స్టో కూడా ఔటవడంతో ఇంగ్లాండ్‌ 43 ఓవర్లకు 246/6తో నిలిచింది. ఈ దశలో ఆ జట్టు 300 చేరితే ఎక్కువ అనుకున్నారంతా. కానీ చివరి ఓవర్లలో స్టోక్స్‌, వోక్స్‌ చెలరేగిపోవడంతో ఇంగ్లాండ్‌ అనూహ్యమైన స్కోరుతో ఇన్నింగ్స్‌ను ముగించింది. చివరి 6 ఓవర్లలో ఆ జట్టు 68 పరుగులు రాబట్టింది.

భలేవాడు దొరికాడు..
మూడు వన్డేలు.. 2090 పరుగులు.. ఎన్నెన్నో మెరుపు ఇన్నింగ్స్‌లు.. మూడూ హోరాహోరీ పోరాటాలే.. ఫలితంపై ఆద్యంతం ఉత్కంఠే.. ఈ మధ్య కాలంలో ఇంతగా ఉర్రూతలూగించిన సిరీస్‌ మరొకటి ఉండదేమో. సిరీస్‌ విజయమే కాదు.. కొందరు ఆటగాళ్ల వ్యక్తిగత ప్రదర్శన కూడా టీమ్‌ఇండియాకు, అభిమానులకు అమితానందాన్నిచ్చింది. ఐతే సిరీస్‌ మొత్తంలో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గది మాత్రం కేదార్‌ జాదవ్‌ ప్రదర్శనే. అతడి రూపంలో ఒక ఆణిముత్యమే దొరికాడు టీమ్‌ఇండియాకు. చరమాంకంలో ఉన్న ధోని తర్వాత అతడి స్థానాన్ని భర్తీ చేయగల ‘ఫినిషర్‌’ కోసం కొన్నేళ్లుగా సాగుతున్న అన్వేషణకు కేదార్‌ తెరదించేట్లే కనిపిస్తున్నాడు. తొలి, మూడు వన్డేల్లో తీవ్ర ఒత్తిడి మధ్య తడబాటు లేకుండా.. సమయానుకూలంగా భారీ షాట్లు ఆడుతూ కేదార్‌ చెలరేగిన తీరు అమోఘం. వయసు 31 ఏళ్లయినా.. అనుభవం దృష్ట్యా కేదార్‌ కుర్రాడే. 12 వన్డేల అనుభవంతో ఈ సిరీస్‌లో అడుగుపెట్టిన జాదవ్‌.. ఓ అనుభవజ్ఞుడిలా ఆడిన తీరు అందరినీ ఆకట్టుకుంది. తొలి వన్డేలో అయినా అతడకి కోహ్లి అండ ఉంది. కానీ మూడో వన్డేలో అలాంటి పరిస్థితి. తనే ముఖ్య పాత్రలోకి మారి.. పాండ్యకు అండగా నిలుస్తూ.. సమయోచితంగా చెలరేగుతూ జట్టును విజయానికి చేరువ చేశాడు. ఈడెన్‌లో కేదార్‌ జట్టును గెలిపించలేకపోయినా అతడి ఇన్నింగ్స్‌ విలువ తగ్గిపోదు. అతను అభిమానుల మనసు గెలిచాడు. ప్రతికూల పరిస్థితుల్లో అసాధారణ ఇన్నింగ్స్‌లతో చెలరేగిన జాదవ్‌.. భవిష్యత్‌పై ఆశలు రేకెత్తించాడు. మిడిలార్డర్లో మరో ధోని కాగలడనిపించాడు.
ఆ ఆరు బంతుల్లో..
వోక్స్‌ వేసిన చివరి ఓవర్‌ అనూహ్య మలుపులు తిరుగుతూ సాగింది. 6 బంతుల్లో 16 పరుగులు చేయాల్సి రావడంతో మొదట మొగ్గు ఇంగ్లాండ్‌ వైపే. ఐతే జాదవ్‌ ఎక్స్‌ట్రా కవర్‌ దిశగా అద్భుత రీతిలో వరుసగా 6, 4 బాది మ్యాచ్‌ను భారత్‌ వైపు తిప్పాడు. 4 బంతుల్లో 6 పరుగులే అవసరం కావడంతో విజయం తేలికే అనిపించింది. కానీ తర్వాతి రెండు బంతులకు జాదవ్‌ పరుగు తీయలేకపోయాడు. ఐదో బంతికి కవర్స్‌ దిశగా భారీ షాట్‌ ఆడబోయి బిల్లింగ్స్‌కు దొరికిపోయాడు. చివరి బంతికి 6 పరుగులు అవసరం కాగా.. భువనేశ్వర్‌ షాట్‌ కోసం ప్రయత్నించి విఫలమయ్యాడు.