ఫినిషింగ్‌’ ఎవరిదో?

81485887676_625x300

నేడు భారత్, ఇంగ్లండ్‌ చివరి టి20
గెలిస్తే సిరీస్‌ సొంతం
హోరాహోరీ పోరు ఖాయం   

 

భారత్, ఇంగ్లండ్‌ పోరు తుది అంకానికి చేరింది. మధ్యలో కొన్ని రోజులు విరామం మినహా దాదాపు మూడు నెలలుగా సాగుతున్న ఈ సమరంలో ఆఖరి పంచ్‌ విసిరేందుకు ఇరు జట్లు సన్నద్ధమయ్యాయి. టెస్టు సిరీస్‌ ఆసాంతం ఆధిపత్యం ప్రదర్శించి, వన్డేల్లో కాస్త తడబడ్డా సిరీస్‌ గెలుచుకోగలిగిన టీమిండియా మరో సిరీస్‌ను తమ ఖాతాలో వేసుకోవాలని భావిస్తోంది. ఇక కఠినంగా సాగిన పర్యటనను విజయంతో ముగించి పొట్టి ఫార్మాట్‌లోనైనా తమ ఆధిక్యం చూపించాలని ఇంగ్లండ్‌ పట్టుదలగా ఉంది. పరుగుల వరదకు నిలయం, పరిమాణంలో పేరుకు తగ్గట్లే ఉన్న చిన్నస్వామి స్టేడియంలో మరో ధనాధన్‌ వినోదం మాత్రం ఖాయం.

బెంగళూరు: ఇంగ్లండ్‌తో గత టి20 మ్యాచ్‌లో ఓటమి అంచుల్లోంచి విజయాన్ని అందుకున్న భారత్‌ కొండంత ఆత్మవిశ్వాసంతో ఇప్పుడు తర్వాతి మ్యాచ్‌కు సిద్ధమైంది. ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా చివరి టి20 నేడు (బుధవారం) ఇక్కడ జరుగుతుంది. సిరీస్‌లో ప్రస్తుతం రెండు జట్లు 1–1తో సమంగా ఉండగా, ఆఖరి మ్యాచ్‌ సిరీస్‌ ఫలితాన్ని నిర్ణయించనుంది. భారత గడ్డపై సుదీర్ఘంగా సాగిన ఇంగ్లండ్‌ పర్యటనకు కూడా ఈ మ్యాచ్‌తో ముగింపు లభించబోతోంది. ఈ మ్యాచ్‌ గెలిస్తే టి20ల్లో ఇంగ్లండ్‌పై భారత్‌కు ఇదే తొలి సిరీస్‌ విజయం అవుతుంది.

బ్యాటింగ్‌లో చెలరేగేనా?
సిరీస్‌లోని తొలి రెండు మ్యాచ్‌లలో భారత జట్టు నమోదు చేసిన స్కోర్లు 147, 144. సాధారణంగా భారత బ్యాట్స్‌మెన్‌ మెరుపు ప్రదర్శనే జట్టుకు విజయాలు అందిస్తుంది. ఈ సిరీస్‌లో మాత్రం ఆశ్చర్యకరంగా మన బౌలర్లు చక్కటి ప్రదర్శన కనబర్చారు. ముఖ్యంగా నాగ్‌పూర్‌ మ్యాచ్‌ గెలుపు క్రెడిట్‌ పూర్తిగా బౌలర్లకే చెందుతుంది. ఈ మ్యాచ్‌లో కూడా సీనియర్‌ ఆశిష్‌ నెహ్రాతోపాటు జస్‌ప్రీత్‌ బుమ్రా పేస్‌ కీలకం కానుంది. ఇద్దరు లెగ్‌ స్పిన్నర్లు అమిత్‌ మిశ్రా, యజువేంద్ర చహల్‌ కూడా తమ స్థానాలు నిలబెట్టుకునే అవకాశం ఉంది. ఐపీఎల్‌లో ఆర్‌సీబీ తరఫున ఈ వేదికపై అనేక మ్యాచ్‌లు ఆడిన చహల్‌ ఇక్కడా చెలరేగాలని పట్టుదలగా ఉన్నాడు. గత మ్యాచ్‌లో ఒక్క ఓవర్‌ కూడా బౌలింగ్‌ చేయని హార్దిక్‌ పాండ్యాను కెప్టెన్‌ కోహ్లి ఈసారి ఎలా ఉపయోగించుకుంటాడో చూడాలి. బ్యాటింగ్‌లో మాత్రం మనవాళ్లు స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వలేదు. ఈ మ్యాచ్‌లోనైనా వారు చెలరేగితే భారీ స్కోరు ఖాయం. ఆర్‌సీబీ కెప్టెన్‌ కోహ్లితో పాటు కర్ణాటక  ఆటగాళ్లు రాహుల్, మనీశ్‌ పాండేలకు ఇది సొంత మైదానం. ముఖ్యంగా కోహ్లి నుంచి అభిమానులు ఒక దూకుడైన ఇన్నింగ్స్‌ ఆశిస్తున్నారు. రెండు మ్యాచ్‌లలోనూ విఫలమైన యువరాజ్‌తో పాటు రైనా, ధోని కూడా ధాటిగా ఆడాల్సి ఉంది. ఇక సిరీస్‌ విజేతను నిర్ణయించే మ్యాచ్‌ కావడంతో రిషభ్‌ పంత్‌కు స్థానం లభించడం అసాధ్యం.

ఇంగ్లండ్‌ ఆశలు…
సిరీస్‌ విజయానికి చేరువగా వచ్చి అనూహ్యంగా రెండో మ్యాచ్‌ ఓడిపోయిన ఇంగ్లండ్‌ ఆ షాక్‌ నుంచి కోలుకునే ప్రయత్నంలో ఉంది. రెండు సార్లు కూడా భారత్‌ను కట్టడి చేయగలిగిన మోర్గాన్‌ సేన మరోసారి అదే ఆధిక్యం ప్రదర్శించి చివరి మ్యాచ్‌లో నెగ్గాలని పట్టుదలగా ఉంది. ఆఖరి ఓవర్‌లో అంపైర్‌ తప్పుడు నిర్ణయంతో రూట్‌ అవుటయ్యాడని సమర్థించుకున్నా, ఇప్పుడు మ్యాచ్‌కు ముందు దానికి విలువ లేదు. అయితే బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ఆఖరి వరకు కూడా హిట్టర్లు ఉండటం ఆ జట్టుకు ప్రధాన బలం. రాయ్, బిల్లింగ్స్, రూట్, మోర్గాన్, స్టోక్స్‌లతో బ్యాటింగ్‌ లైనప్‌ పటిష్టంగా కనిపిస్తోంది. అలీ, డాసన్‌ కూడా వేగంగా ఆడగల సమర్థులు. పేసర్‌ జోర్డాన్‌ కచ్చితత్వంతో బౌలింగ్‌ చేస్తూ భారత బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేస్తుండగా, స్టోక్స్, అలీ కూడా ఆకట్టుకున్నారు. సిరీస్‌లో రెండు మ్యాచ్‌లను చూస్తే నాగ్‌పూర్‌లో చివరి ఓవర్‌ వైఫల్యం మినహా ఇంగ్లండ్‌ మనకంటే మెరుగైన జట్టుగా కనిపిస్తోంది. ఇప్పుడు ఇదే జట్టు సమష్టిగా చెలరేగి కనీసం ఒక ట్రోఫీతో స్వదేశం తిరిగి వెళ్లాలని ఆశపడుతోంది. మరోవైపు ఈనెల 4న జరగనున్న ఐపీఎల్‌ వేలంలో ఇంగ్లండ్‌ ఆటగాళ్లకు మంచి డిమాండ్‌ వస్తుండటంతో ఈ మ్యాచ్‌లో చెలరేగిన ప్లేయర్లు ఫ్రాంచైజీల దృష్టిలో పడటం ఖాయం.

తుది జట్ల వివరాలు (అంచనా)
భారత్‌: కోహ్లి (కెప్టెన్‌), రాహుల్, రైనా, యువరాజ్, పాండే, ధోని, పాండ్యా, మిశ్రా, బుమ్రా, నెహ్రా, చహల్‌.
ఇంగ్లండ్‌: మోర్గాన్‌ (కెప్టెన్‌), రాయ్, బిల్లింగ్స్, రూట్, స్టోక్స్, బట్లర్, అలీ, జోర్డాన్, డాసన్‌/ప్లంకెట్, మిల్స్, రషీద్‌.

పిచ్, వాతావరణం
గత ఏడాది 400కు పైగా పరుగులు నమోదైన ఐపీఎల్‌ ఫైనల్‌ తర్వాత ఈ మైదానంలో జరుగుతున్న తొలి మ్యాచ్‌ ఇదే. అవుట్‌ ఫీల్డ్‌ను మాత్రం కొత్తగా తీర్చిదిద్ది అత్యాధునిక డ్రైనేజీ సౌకర్యాలు కల్పించారు. పిచ్‌ మాత్రం ఎప్పటిలాగే బ్యాటింగ్‌కు అనుకూలం. బౌండరీలు చిన్నవి కాబట్టి భారీ షాట్లకు అవకాశం ఉంది.

గత మ్యాచ్‌లో అంపైరింగ్‌ నిర్ణయంపై ఇంగ్లండ్‌ చేసిన విమర్శల గురించి మేం ఇప్పుడు పట్టించుకోనవసరం లేదు. కొన్నిసార్లు నిర్ణయాలు మనకు అనుకూలంగా, కొన్నిసార్లు ప్రతికూలంగా రావడం ఆటలో సహజం. రాబోయే మ్యాచ్‌పైనే మా దృష్టి ఉంది. అనుభవజ్ఞుడైన నెహ్రా ఇస్తున్న సూచనలు నాకెంతో ఉపయోగ పడుతున్నాయి. మేం ఈ మ్యాచ్‌లోనూ సమష్టిగా రాణించి గెలుస్తామనే నమ్మకం ఉంది.         –బుమ్రా, భారత బౌలర్‌